తొలగించిన, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలు పక్కాగా నమోదు చేయాలి ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి బీఎల్‌ఏలు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకీపురంలో శనివారం రాత్రి మండల బూత్ లెవల్ ఏజెంట్లతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఎల్‌ఏలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం మాట్లాడుతూ.. సొంత పనులు, కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి 40 రోజులకుపైగా పార్టీ బలోపేతానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు బీఎల్‌ఏలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి వివరాలు, మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస లేదా షిఫ్టింగ్ అయిన ఓటర్ల సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. వారు ఏ ప్రాంతానికి వెళ్లారనే వివరాలను కూడా స్పష్టంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సమాచారమంతా ప్రత్యేక నోట్‌బుక్‌లలో పక్కాగా రాసి ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై కూడా బీఎల్‌ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ప్రతిరోజూ ఉదయం గ్రామ శాఖ అధ్యక్షులతో కలిసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉదయం అల్పాహారం నాణ్యతను స్వయంగా పరిశీలించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల బృందాల్లో పంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో స్పష్టమైన లెక్కలతో వివరించాలని చెప్పారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, ప్రభుత్వ పథకాలపై వారికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి త్వరలో రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి ఉచిత నమోదు ప్రక్రియలో ప్రజలకు బీఎల్‌ఏలు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఇందిరమ్మ కమిటీల్లో మహిళా సభ్యులకు సరైన నాయకత్వ మద్దతు అందించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ప్రత్యేక సామాజిక మాధ్యమ, వాట్సాప్ బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్