● ముంచెత్తిన ‘వేదన’ కన్నీటి వరదలో ‘వెలిగొండ’ ముంపు గ్రామాలు! గొట్టిపడియ గ్రామాన్ని వీడలేక వీడుతున్న స్థానికులు వె లిగొండ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశామని ప్రచారం చేసుకునే తాపత్రయమే తప్ప.. నిర్వాసితులకు న్యాయం చేయాలన్న కనీస మానవతా దృక్పథం చంద్రబాబు సర్కారులో లేశమంతైనా కానరావడం లేదు. నిర్వాసితులను బెదిరించి, గ్రామాల్లో భయోత్పాతం సృష్టించేందుకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్న తీరు బాబు సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన గెజిట్‌లో పేర్లు ప్రచురితమైనప్పటికీ, క్షేత్రస్థాయి ప్యాకేజీ జాబితాలోకి వచ్చేసరికి పేర్లు గల్లంతు కావడం వెనుక అధికారుల తీవ్ర బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకే కుటుంబంలో కొందరికి ప్యాకేజీ మంజూరు చేసి, మిగిలిన వారికి మొండిచేయి చూపుతూ వ్యత్యాసాలకు తెరలేపారు. గతంలో అధికారులు ఫొటోలు తీసే సమయంలో పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లిన పేద రైతులు, కూలీల వివరాలను నమోదు చేయలేదు. ప్రస్తుతం వారి వద్ద ఆధార్, రేషన్ కార్డులు వంటి పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ జాబితాలో చోటు కల్పించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు సైతం పరిహారం అందకపోవడం బాబు సర్కారు నిరంకుశ వైఖరికి అద్దం పడుతోంది. గ్రామంలో ఉండగానే న్యాయం చేయని అధికారులు, ఊరు విడిచి బయటకు వెళ్లాక పరిహారం ఇస్తారని ఎలా నమ్మాలని, అప్పుడు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని బాధితులు నిలదీస్తున్నారు. ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తున్నామని ప్రచార ఆర్భాటం చేసుకోవడం కోసం అర్హులైన నిర్వాసితులకు అందాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని నీరుగారుస్తున్నారనే అనుమానాలు బాధితుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి తాము ఎన్నడూ అడ్డు చెప్పలేదని, తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం, ఇంటి పట్టాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టులోకి నీటిని పంపాలని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి త్వరలోనే గ్రామాలకు బస్సు రాకపోకలను, నివాస విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ముంపు ప్రజలు తీవ్ర భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు భారీగా అప్పులు తెచ్చి మూడు నెలల క్రితం ఎకరాకు రూ.20 వేల ఖర్చుతో పత్తి, రూ.50 వేల పెట్టుబడితో మిరప సాగు చేశారు. గుండంచర్ల గ్రామంలో 500 ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో మిరప, కలనూతలలో 600 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో మిరప, సుంకేసులలో మరో 800 ఎకరాల్లో పత్తి, మిరపతో పాటు ఆముదం, అరటి తోటలు సాగయ్యాయి. పైర్లన్నీ పూత, పిందె, కాయ దశకు చేరుకుని చేతికొచ్చే సమయంలో గ్రామాలు ఖాళీ చేయాలంటూ ఆదేశించడంతో రైతుల గుండెలు పగిలాయి. దీనికితోడు విద్యుత్ శాఖాధికారులు వ్యవసాయ మోటార్లకు కరెంట్ తొలగించి ట్రాన్స్‌ఫార్మర్లను తరలించుకుపోవడంతో, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు నీరందక కళ్లముందే నిలువునా ఎండిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పచ్చటి పత్తి చేలల్లోకి