కొలంబో: శ్రీలంక క్రికెట్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. 2027లో జరగనున్న తొలి మహిళల టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి తొలగించింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఆరు జట్ల టోర్నీని మరో దేశానికి తరలించాలని నిర్ణయించింది. అయితే కొత్త ఆతిథ్య దేశం ఏదనేది ఇంకా ఖరారు కాలేదు. తదుపరి ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఐసీసీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ పాలనను ప్రభుత్వం నియమించిన ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ పర్యవేక్షిస్తోంది. క్రికెట్ బోర్డులు ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలన్నది ఐసీసీ నిబంధన. అయితే శ్రీలంకలో బోర్డు పాలన, సంస్కరణలు, ఎన్నికల నిర్వహణలో ఆలస్యంపై ఐసీసీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీ ఆతిథ్య హక్కులు తొలగించిన విషయాన్ని శ్రీలంక క్రికెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షాఫ్టర్ ధృవీకరించారు. టోర్నీని శ్రీలంక నుంచి తరలించనున్నట్లు తెలిపారు. కొత్త వేదిక ఎక్కడనేది ఇంకా తెలియదని, తదుపరి ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు కోల్పోవడంతో శ్రీలంక క్రికెట్‌తో పాటు హోటళ్లు, పర్యాటకం, రవాణా, వ్యాపార రంగాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లు, అధికారులు, ప్రసార సిబ్బంది, అభిమానుల రాకతో వచ్చే ఆదాయాన్ని శ్రీలంక కోల్పోనుంది. గతంలోనూ ప్రభుత్వ జోక్యం కారణంగా 2024 అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది