Project Cheetah : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ చీతాలో కీలక ఘటన చోటు చేసుకుంది. కూనో నేషనల్ పార్క్ పరిధిలోని ఒక చీతా.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. అది కూడా ప్రాజెక్ట్ చీతా ప్రారంభమైన నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగు చూడటం విశేషం. కేజీపీ 12 అనే చీతా పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తల్లి చీతా, నాలుగు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక్కడ అసలైన విశేషం.. చీతా నాలుగు పిల్లలకు జన్మనివ్వడమే కాదు. ఆ జన్మనిచ్చిన తల్లి చీతా కూడా ఇండియాలోనే పుట్టడం మరో విశేషం. దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తెచ్చే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా ప్రారంభించిన సంగతి తెలిసిందే. నమీబియా సహా ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను ఇండియా తీసుకొచ్చారు. ఇక్కడ వాటి సంతతిని వృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం మోదీ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17)న మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో చీతాల్ని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి చీతాలు అక్కడ వృద్ధి చెందుతున్నాయి. కొన్ని చీతాలు పిల్లలకు జన్మనిచ్చాయి. మధ్యలో కొన్ని చీతాలు మరణించాయి. దీంతో ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. కానీ, ఇండియాలో జన్మించిన చీతానే ఇప్పుడు మళ్లీ నాలుగు చీతా పిల్లలకు జన్మనివ్వడం విశేషం. దీంతో ఈ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తాజాగా జన్మించిన నాలుగు పిల్లలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి షేర్ చేశారు