సాధారణంగా ద్రాక్ష సాగు అంటే ఒక నిర్దిష్ట సీజన్‌లో పంట కోసి మార్కెట్‌కు తరలించడం అలవాటు. కానీ అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, రామనేపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి అందుకు భిన్నంగా ఆలోచించి ద్రాక్ష సాగులో కొత్త అధ్యాయం సృష్టించారు. 40 ఏళ్ల అనుభవాన్ని ఆధునిక సాగు ప్రణాళికతో మేళవించి, అన్-సీజన్‌లోనూ ద్రాక్ష పండిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. ఆయన మాస్టర్ ప్లాన్ 8 ఎకరాల్లో విడతలవారీగా దిగుబడి వచ్చేలా రూపకల్పన చేయడం విశేషం. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న కృష్ణారెడ్డి గతంలో వేరుశెనగ, టమాటా వంటి పంటలను సాగు చేశారు. అయితే, కాలక్రమేణా ద్రాక్ష సాగుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి, తన అనుభవంతో అనేక కొత్త పద్ధతులను అనుసరించడం ప్రారంభించారు. మార్కెట్ ధరలు సరిగా లభించకపోవడం, కూలీల కొరత వంటి సమస్యలు ఇతర పంటలలో ఎదుర్కొని, ద్రాక్షను లాభసాటిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కృష్ణారెడ్డి ఆలోచన ప్రకారం, సీజన్‌లోనే కాదు అన్-సీజన్‌లోనూ ద్రాక్షను పండించి మంచి ధరను అందుకోవచ్చు. ప్రస్తుతం ఆయనకు రెండు ఎకరాల్లో ద్రాక్ష సాగులో ఉంది. దీనికి అదనంగా, 2025 ఫిబ్రవరిలో మరో ఆరు ఎకరాల్లో “దిల్ కుష్” రకం మొక్కలను నాటారు. దీంతో మొత్తం ఎనిమిది ఎకరాల్లో ద్రాక్ష సాగు విస్తరించింది. ఇక్కడే కృష్ణారెడ్డి సాగు వ్యూహం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎనిమిది ఎకరాల్లో పంట ఒకేసారి చేతికి వచ్చేలా కాకుండా, విడతలవారీగా దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేశారు. ఒక రెండు ఎకరాల్లో దిగుబడి పూర్తయ్యే సమయానికి, మరో రెండు ఎకరాల్లో పంట కోతకు సిద్ధమయ్యేలా రూపొందించారు. ఇది మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి రైతును రక్షించి, అధిక ధర ఉన్నప్పుడు పంటను విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ద్రాక్ష తోట ఏర్పాటుకు ఎకరానికి సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో పందిరి, మొక్కలు నాటడం వంటివి ఉంటాయి. చిక్‌బళ్లాపూర్ నుంచి తెచ్చిన దిల్ కుష్ రకం మొక్క ఒక్కంటికి 150 రూపాయలు ఖర్చు అయ్యింది. మొక్కలు నాటిన 16-18 నెలల్లో పంట చేతికి వస్తుందని, 2025 ఫిబ్రవరిలో నాటిన మొక్కలు 2026 జనవరి నాటికి కటింగ్ చేసుకోవడానికి సిద్ధమవుతాయని ఆయన వివరించారు. పంటకు మామూలు పశువుల ఎరువు, ఆముదం చెక్క, పొటాష్ వంటి ఎరువులను ఉపయోగిస్తారు. ఎనిమిది ఎకరాలకు 100 మూటల ఆముదం చెక్క, 20 మూటల పొటాష్ వేశారు. తెగుళ్ల నివారణకు బుడ్డ పురుగుల కోసం క్లోరోపైరిపాస్, త్రిప్స్ వంటి వాటికి మందులు పిచికారీ చేస్తారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, తోటను నిరంతరం పర్యవేక్షిస్తూ తెగుళ్లు, చీడపీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ద్రాక్ష సాగులో మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన చెప్పారు. పోయినసారి ఒక ముక్కాలు ఎకరంలో 50 టన్నుల పంట పండిందని, 40 రూపాయల ధర వచ్చినా దాదాపు 20 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని కృష్ణారెడ్డి ఉదాహరణగా చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో 50 నుంచి 60 రూపాయల వరకు ధర పలుకుతోంది. ద్రాక్షకు కూలీల ఖర్చు ఎక్కువైనా, సరైన ప్రణాళికతో సాగు చేస్తే లాభాలు బాగా ఉంటాయని ఆయన అభిప్రాయం. గతంలో అనంతపురంలోనే వ్యాపారస్తులు ఉండేవారని, ఇప్పుడు కర్