Kaizer News

ఇథనాల్ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు

ఇథనాల్ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు

· State - Telangana · prabhanews.com

బెజ్జంకి, ఆంధ్రప్రభ: మండలంలోని గుగ్గిళ్ల శివారులోని ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను సాగునీటి కాలువలోకి విడుదల చేస్తున్నారని ఆరోపిస్తూ అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెజ్జంకి మండలం దాచారం శివారులోని సాగునీటి కాలువను వారు పరిశీలించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలు గుగ్గిళ్ల నుంచి బెజ్జంకి ఎక్స్‌రోడ్, గాగిల్లాపూర్, దాచారం మీదుగా తోటపల్లి చెరువులోకి వెళ్లే కాలువలో చేరుతున్నాయని ఆరోపించారు. దీంతో చేపలు, పశువులు మృతి చెందడమే కాకుండా పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. కాలువ వెంబడి ఉన్న బోరుబావులు, భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలోనూ ఇదే కాలువలోకి వ్యర్థాలను విడుదల చేయడంతో చేపలు మృతి చెందాయని, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని నాయకులు గుర్తు చేశారు. అప్పట్లో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు బెజ్జంకి బంద్‌కు పిలుపునిస్తూ వందలాది మందితో నిరసన చేపట్టామని తెలిపారు. తాత్కాలికంగా వ్యర్థాల విడుదల నిలిపివేసినప్పటికీ ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. వెంటనే ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి, మత్స్య, పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి కాలువలోకి వ్యర్థాల విడుదలను అడ్డుకోవాలని, కలుషిత నీరు, పంటలు, పశువులు, చేపలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు కరివేద మహిపాల్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, డీఎస్‌పీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు కోలిపాక రాజు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News