Kaizer News

India at UN | వాణిజ్య నౌకాయానం లక్ష్యం కారాదు.. ఐర

India at UN | వాణిజ్య నౌకాయానం లక్ష్యం కారాదు.. ఐరాస‌లో తీవ్రంగా ఖండించిన భార‌త్‌

· National - India · ntnews.com

India at UN : భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణ హక్కులను ఎవరూ అడ్డుకోరాదని ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా భారత్ (India) స్పష్టంచేసింది. బహ్రెయిన్ (Bahrain) అధ్యక్షతన సముద్ర భద్రతపై నిర్వహించిన భద్రతామండలి (Security Council) సమావేశంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పీ హరీశ్ (P Harish) ఈ వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, సురక్షితమైన సముద్ర జలాలపట్ల భారత్ తన నిబద్ధతను వ‌దులుకోద‌ని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న దాడుల కారణంగా భారతీయ నౌకలు, నావికులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల ఫలితంగా చమురు, గ్యాస్ సరఫరాలకు ఆటంకం ఏర్పడి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. గత ఏప్రిల్‌లో ఇరాన్ దళాలు రెండు భారత నౌకలపై హెచ్చరికగా కాల్పులు జరపడం, జూలైలో ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారత నావికుడు మరణించ‌డం, మరొకరు గాయపడటం లాంటి ఘటనలను ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా జూన్ నెలలో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయారని, ఈ పరిణామాలపై సంబంధిత దేశాలకు ఇప్పటికే నిరసన తెలియజేశామని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల రక్షణలో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తోందని హరీశ్ వివరించారు. భారత భద్రతా ఆపరేషన్ల పర్యవేక్షణలో ఇప్పటివరకు 449 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని, వీటి ద్వారా సుమారు 8.4 బిలియన్ డాలర్ల విలువైన కార్గో రవాణా జరిగిందని వెల్లడించారు. ఇంధన మార్గాల భద్రత కోసం పశ్చిమ అరేబియా సముద్రంలో 11 నౌకలతో ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దిగ్బంధనాల కారణంగా హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న వందలాది మంది భారత నావికుల భద్రత, వారిని సురక్షితంగా తీసుకురావడంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని కోరారు. మానవరహిత వ్యవస్థలు, సైబర్ దాడుల రూపంలో ఎదురవుతున్న నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు

Original source: ntnews.com
Read more on Kaizer News