Kaizer News

ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు..

ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు..

· State - Telangana · prabhanews.com

ములుగు, ఆంధ్రప్రభ : ప్రణాళికాబద్ధమైన బోధనతో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, వారిని ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలలోని నిఘా కెమెరాల పనితీరును పరిశీలించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం తరగతి గదులను సందర్శించి బోధన తీరును పరిశీలించారు. జూనియర్ కళాశాల విద్యార్థినులకు నిర్వహిస్తున్న యూనిట్‌ పరీక్షల తీరును పరిశీలించి, పరీక్షల నిర్వహణపై సంబంధిత ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్ణీత ఆహార పట్టిక ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన, పౌష్టికమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఆహార పట్టిక ప్రకారం అందించాల్సిన భోజన పదార్థాల వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనం తయారీలో నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్ స్వాతి, రికార్డు అసిస్టెంట్ రాజు, సంబంధిత అధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News