Kaizer News

వణికిస్తున్న విజి‘లెన్స్‌’

వణికిస్తున్న విజి‘లెన్స్‌’

· State - Telangana · ntnews.com

తనిఖీలతో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు హడల్‌ విద్యార్థులకు బీ క్యాటగిరి సీట్లు ఇవ్వనందుకే టార్గెట్‌ రోజుల తరబడి విచారణ.. 67 అంశాలపై ఆరా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తనిఖీలతో రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు బెంబేలెత్తుతున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన ఈ తనిఖీలు శనివారం నాలుగో రోజు కూడా కొనసాగాయి. ఒక్కో కాలేజీలో 10-12 మందితో కూడిన బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ బృందాల్లోని అధికారులు ఏకంగా 67 అంశాలపై ఆరా తీస్తున్నారు. విద్యార్థుల అటెండెన్స్‌, ఫ్యాకల్టీల వేతనాలు, ఎంత మంది ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు, వారి సర్టిఫికెట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అవకతవకలు, ల్యాబ్‌లు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి పోలీసులతో రోజుల తరబడి తనిఖీలు నిర్వహిస్తుండటంతో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల యజమానులు హడలిపోతున్నారు. తెల్లారితే ఎవరి వంతు వస్తుందోనన్న టెన్షన్‌తో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కొన్ని కాలేజీలు అవకతవలకు పాల్పడ్డాయని, వాటిపై విచారణ జరుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించడంతో ఆ వెంటే విజిలెన్స్‌ తనిఖీలు షురూ అయ్యాయి. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో విద్యార్థులకు బీ-క్యాటగిరీ సీట్లు ఇవ్వనందుకే వాటిని టార్గెట్‌ చేశారన్న ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఈసారి సీఎంవో నుంచే సీఎస్‌ఈ (బీటెక్‌) సీట్ల దందా నడిచింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం పలు కాలేజీలకు సీఎంవో నుంచి ఫోన్లు వెళ్లాయి. అయినప్పటికీ కొన్ని కాలేజీలు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించాయని, మరికొన్ని కాలేజీలు సీట్లు ఇచ్చినా డోనేషన్లు దండుకున్నాయని, అందుకే విజిలెన్స్‌ దాడులు జరుగుతున్నాయని యాజమాన్యాలు చర్చించుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో అవకతవకలు జరిగాయన్న సీఎం ఆరోపణలను ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల యజమానులు కొట్టిపారేస్తున్నారు. కన్వీనర్‌ కోటా సీట్లను ప్రభుత్వమే భర్తీచేస్తుందని, వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని, ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నప్పుడు అక్రమాలకు తావెక్కడుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒకే విద్యార్థి పేరిట రెండుసార్లు రీయింబర్స్‌మెంట్‌ పొందే అవకాశమే ఉండదని చెప్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుడు దసరా సమయంలో బంద్‌కు పిలుపునిచ్చిన కాలేజీల యజమానులు ఇప్పుడు మళ్లీ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్‌ తనిఖీలకు ఇది కూడా ఓ కారణమన్న ప్రచారం జరుగుతున్నది. పాత బకాయిలు ఇవ్వాలని మొత్తుకుంటున్న తమపై సర్కార్‌ విజిలెన్స్‌ దాడులు చేయిస్తున్నదని యాజమాన్యాలు వాపోతున్నాయి. తమ కళాశాలల్లో ఇప్పటికే ఏటా ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆచార్యులు, ఫ్యాక్ట్‌ ఫైడింగ్‌ కమిటీలు చేస్తున్న తనిఖీలు చేస్తున్నాయని, ఇవి కాకుండా మళ్లీ విజిలెన్స్‌ తనిఖీలు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News