పు రూరవుడి కొడుకు ఆయువుకు నహుషుడు, క్షుత్రవృద్ధుడు, రంభుడు తర్వాత మహా బలసంపన్నుడైన రజి అనే కొడుకు కలిగాడు. రజికి ఐదువందల మంది కొడుకులు కలిగారు. రజి తన రాజ్యాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో దేవ దానవుల నడుమ భీకర సంగ్రామం జరిగింది. రోజులు గడుస్తున్న కొద్ది పోరు మరింత ఘోరంగా పరిణమిస్తోందే తప్ప, జయాపజయాలు ఎటూ తేలడం లేదు. ఎటూ తోచక ఉభయపక్షాలవారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, ‘బ్రహ్మదేవా! ఈ పోరులో అంతిమ విజయం ఎవరికి దక్కుతుందో నువ్వే చెప్పాలి’ అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ‘నాయనలారా! రజి మహారాజు మీలో ఎవరి పక్షం వహిస్తే, పోరులో విజయం వారినే వరిస్తుంది’ అని చెప్పాడు. వెంటనే మొదట దానవులు రజి మహారాజు వద్దకు వెళ్లారు. రజి వారిని సాదరంగా ఆహ్వానించి, వచ్చిన పనేమిటో చెప్పమన్నాడు. ‘మహారాజా! మాకు, దేవతలకు సంగ్రామం జరుగుతోంది. నువ్వు మా పక్షాన యుద్ధంలో పాల్గొనాలని మా కోరిక’ అని చెప్పారు దానవులు. ‘మీ తరఫున యుద్ధం చేయాలంటే, నాదొక్కటే షరతు. యుద్ధం ముగిశాక నాకు ఇంద్రపదవి ఇస్తామని మాట ఇవ్వండి’ అన్నాడు రజి మహారాజు. దానవులు తమలో తాము తర్జన భర్జనలు పడి, ‘రాజా! ఇప్పుడు మాట ఇచ్చి, తర్వాత కాదనడం ధర్మం కాదు. అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురమే మంచిది. మా లోకానికి రాజు ప్రహ్లాదుడు. ఆయనకు ఇంద్ర పదవి దక్కాలనే మేమంతా దేవతలతో యుద్ధానికి సిద్ధపడ్డాం. కాబట్టి నీకు ఇంద్రపదవిని ఇవ్వలేము. మరింకేదైనా కోరుకుంటే తప్పక ఇస్తాము’ అని చెప్పారు. ‘ఇంద్ర పదవి తప్ప మరేదీ నాకు సమ్మతం కాదు’ తెగేసి చెప్పాడు రజి మహారాజు. చేసేది లేక దానవులు వెళ్లిపోయారు. దానవులు వెళ్లిపోయిన కొద్దసేపటికే దేవతలందరూ రజి మహారాజు వద్దకు వచ్చారు. యుద్ధంలో తమ పక్షాన పాల్గొనాలని అభ్యర్థించారు. దానవులతో చెప్పినట్లే, ‘యుద్ధం ముగిశాక నాకు ఇంద్ర పదవి ఇవ్వడానికి అంగీకరిస్తేనే మీ తరఫున యుద్ధంలో పాల్గొంటాను’ అని కరాఖండిగా చెప్పాడు. దేవతలు ఎక్కువగా ఆలోచించకుండా, రజి మహారాజు షరతుకు తమ సమ్మతి తెలిపారు. రజి మహారాజు తన సేనలను వెంటబెట్టుకుని దేవతల తరఫున యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధరంగంలో వీరవిహారం చేస్తూ, శత్రువులు కని విని ఎరుగని దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. అనాయాసంగానే అశేష దానవ వాహినిని పరాజితులను చేశాడు. అతడి అస్త్రాల ధాటికి మరణించిన వారు మరణించగా, మిగిలిన దానవులు పలాయనం చిత్తగించారు. రజి మహారాజు సాయంతో దేవతలు విజేతలయ్యారు. యుద్ధం ముగిశాక దేవేంద్రుడు రజి మహారాజు పాదాల ముందు మోకరిల్లి, ‘మహానుభావా! ఆర్తుడనైన నాకు అభయప్రదానం చేసి, స్వర్గలోకాన్ని కాపాడావు. అభయప్రదాతవు గనుక నువ్వు నాకు సాక్షాత్తు పితృసమానుడవు. ముల్లోకాలకూ ఆరాధ్యుడవైన పురుషోత్తముడవు నువ్వు. నన్ను నీ పుత్రుడిగా స్వీకరించు’ అని ప్రార్థించాడు. దేవేంద్రుడి ప్రణుతి వాక్యాలలోని అంతరార్థాన్ని గ్రహించిన రజి మహారాజు చిరునవ్వు చిందించాడు. ‘శరణు కోరినవాడు పగవాడైనా తిరస్కరించడం వీరధర్మం కాదు. నర్మగర్భంగా, నయంగా మాట్లాడి నువ్వు నా మనసు చూరగొన్నావు. నీ మనోగతం నాకు అవగతమైంది. నీ స్వర్గాన్ని నీకు పునర్దత్తం చేస్తున్నాను’ అని పలికి, తనకు దేవతలు ఇచ్చిన ఇంద్రపదవిని తిరిగి దేవేంద్రుడికే కట్టబె