Kaizer News

అంతా అబద్ధాల ఒప్పందమే!

అంతా అబద్ధాల ఒప్పందమే!

· State - Telangana · prabhanews.com

కార్మికుల హక్కులను తాకట్టు పెట్టారని టీబీజీకేఎస్ విమర్శ సొంతింటి కలపై ఏం ఒప్పందం చేశారో చెప్పాలని డిమాండ్ గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు పరిశ్రమ కార్మికుల హక్కులను తాకట్టు పెట్టి చారిత్రాత్మక ఒప్పందం చేశామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గొప్పలు చెప్పుకుంటోందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కార్మికులు సాధించుకున్న హక్కులనే మళ్లీ కొత్తగా సాధించామని చెప్పడం మోసపూరితమని ఆరోపించారు. ఇదంతా అబద్ధాల ఒప్పందమని కొట్టిపారేశారు. కొత్తగా చేసుకున్నామని చెబుతున్న ఒప్పందాలపై కూడా స్పష్టత లేదని అన్నారు. కార్మికులకు దశాబ్దాలుగా డిమాండ్‌గా ఉన్న సొంతింటి కల విషయంలో ఎలాంటి ఒప్పందం జరిగిందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు జరిగిన మేలును కూడా ఇప్పుడు కొత్త ఒప్పందంగా ప్రచారం చేసుకోవడంపై రాజిరెడ్డి మండిపడ్డారు. కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏఐటీయూసీ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతుందని విమర్శించారు. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి మాట్లాడుతూ సింగరేణి కోల్‌బెల్ట్ వ్యాప్తంగా సంస్థ ఆస్తులు ధ్వంసమవుతున్నా గుర్తింపు సంఘం స్పందించడం లేదని ఆరోపించారు. సింగరేణి పరిశ్రమతోనే ఉత్తర తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉందని, కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. కార్మిక వర్గానికి అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో నూనె కొమురయ్య, పార్లపల్లి రవి, చెల్పూరి సతీష్, జోసెఫ్, రాజ్‌కుమార్, శేషగిరి, సంపత్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News