పెద్దపల్లి, ఆంధ్రప్రభ : నీట్ పీజీ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన నీట్ పీజీ–2026 పరీక్షల సందర్భంగా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెద్దపల్లి జోన్ పరిధిలో మూడు పరీక్షా కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నిర్వహణతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పోలీస్ కమిషనర్ కోరారు