నిధుల రికవరీ ఊసే లేదు … క్రమశిక్షణ చర్యల జాడలేదు రూ.35 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం ? వ్యక్తిగత ఖాతాలకు కోట్లాది రూపాయల మళ్లింపు దస్త్రాలు, ఓచర్లు మాయం.. జడ్పీ తీర్మానం లేకుండానే నిధుల వ్యయం జడ్పీ సీఈఓ సంతకం లేకుండానే చెక్కుల జారీ ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో సంచలన విషయాలు అవకతవకలు జరిగాయని తేల్చినా.. బాధ్యులెవరో తేల్చలేకపోయిన వైనం (చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ ) : చిత్తూరు జిల్లా పరిషత్‌లో ఏళ్ల తరబడి సాగిన నిధుల వ్యవహారంపై జరిగిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం, జడ్పీ తీర్మానం లేకుండానే పనులకు నిధులు కేటాయించడం, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నిధులు మళ్లించడం, జడ్పీ సీఈఓ సంతకం లేకుండానే చెక్కులు జారీ చేయడం వంటి అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాలకు సంబంధించిన కీలక దస్త్రాలు, ఓచర్లు, ఇతర ఆధారాలు మాయమవడంతో అసలు బాధ్యులను గుర్తించడంలో విచారణ కమిటీ చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. దీంతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు తేలినా.. ఎవరు చేశారు? ఎవరి హయాంలో జరిగింది? ఎవరి ఖాతాలకు వెళ్లాయి? అన్న ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. దీంతో దుర్వినియోగమైన కోట్లాది రూపాయల రికవరీ గురించి ప్రస్తావన లేకుండా పోయింది. దోచుకున్న ప్రభుత్వ ధనం దోచుకున్న వారికి సొంతం అయ్యింది. ఇందుకు సంబంధించిన రికార్డులు లభ్యం కాకపోవడంతో ఎవరిని దోషులుగా తేల్చలేదు. కావున ఎవరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం కూడా లేదు. ప్రభుత్వ వ్యవహారం అంటే ఇలానే ఉంటుందన్న భావన ప్రజల్లో బలపడుతోంది. అందరూ శ్రీ వైష్ణవులే కానీ బుట్టలో చేపలు మాయం అన్న సామెత జిల్లా పరిషత్ నిధుల దుర్వినియోగం విషయానికి అతికినట్లు సరిపోతుంది. జిల్లా పరిషత్ నిధుల దుర్వినియోగం నిజమే.. జిల్లా పరిషత్‌కు విడుదలైన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు (బీఆర్‌జీఎఫ్), ఆర్థిక సంఘం నిధులు, వాటిపై వచ్చిన వడ్డీల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జడ్పీకి వివిధ పథకాల కింద విడుదలైన సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు సమాచారం. వాటిపై వచ్చిన వడ్డీతో పాటు బీఆర్‌జీఎఫ్ నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా వినియోగించినట్లు అప్పటి జడ్పీ ఉద్యోగులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా ఆడిట్ అధికారి కృష్ణారెడ్డిని కలెక్టర్ విచారణాధికారిగా నియమించారు. ఆయన 2024 ఆగస్టులో విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికపై సంతృప్తి చెందని జిల్లా కలెక్టర్ మరోసారి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లా ఆడిట్, సహకార శాఖ అధికారులు, జడ్పీ సీఈఓలతో త్రి సభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఖాతాల వారీగా పరిశీలన చేయడంతో నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి సంబంధించిన మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి? నిధుల దుర్వినియోగానికి సంబ