హనుమకొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ దేవన్నపేట గ్రామానికి చెందిన నందిపాక కుమార్ (కన్ని) కాలి శస్త్రచికిత్స కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజును సంప్రదించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, ఆయన చికిత్స కోసం రూ.1.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు. మెరుగైన వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి కంటికి రెప్పలా అండగా ఉంటామని అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచినందుకు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 65వ డివిజన్ అధ్యక్షుడు సునీల్, కాంగ్రెస్ నాయకులు పొలపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు