ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల రసవత్తరంగా మారింది. రెండు నెలల క్రితం నిర్వహించిన ఎన్నిక సమావేశంలో ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌కు కాకుండా బీజేపీకి మద్దతివ్వడం.. ఎజెండా కాపీ లేదని, ఇతర గందరగోళాల మధ్య వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం మరోసారి ఎన్నిక నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నాలుగు కో ఆప్షన్ సభ్యుల స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో పలువురు సభ్యులు ఎజెండా కాపీ అందలేదని బాయ్ కాట్ చేయగా.. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా ప్రతి సభ్యుడికి కాపీ అందించి ఫొటో దిగడమే కాకుండా రిజిస్ట్రర్ పోస్టులోనూ కాపీని పంపించారు. బీజేపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు కలెక్టర్ రాజర్షి షాను కలిసి కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఎన్నికకు అడిషనల్ కలెక్టర్‌ను నియమించాలని, సమావేశాన్ని లైవ్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిని బండారి అనూష చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. బీజేపీకి 21 స్థానాలతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పదవి దక్కలేదు. కాగా ఈసారి కూడా నలుగురు ఇండిపెండెట్ల మద్దతు తమకే ఉందని, సభ్యుల సంఖ్యా బలం 27కు పెంచుకొని కో ఆప్షన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అటు కూటమిలో చైర్‌పర్సన్‌తో పాటు, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఎంఐఎంకు చెందిన ఆరుగురు కలిసి మొత్తం 24 మంది సభ్యులే ఉన్నారు. అయితే తమకు అనుకూల పరిస్థితి వచ్చే వరకు మరికొన్ని రోజులు సమావేశాన్ని వాయిదా వేయాలనే కూటమి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది