అరాచక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి మోత్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు కృషి చేయాలని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు డా. వర్రే వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా తొలిసారి స్వగ్రామమైన సదర్శాపూర్‌కు వచ్చిన ఆయనకు స్థానిక యువకులు, మహిళలు, గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. వర్రే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో పండుగలు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అరాచక శక్తులను ముందుగానే గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. గ్రామస్థాయిలో శాంతిభద్రతలు అదుపులో ఉంటే కక్షలు, తగాదాలకు చోటు ఉండదని, తద్వారా గ్రామాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనాలను గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు