కాలం తీరిన ప్రభుత్వ మందులను బహిరంగంగా కాల్చివేత hospital-iron-tablets | నందికొట్కూరు, ఆంధ్రప్రభ : ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ మందుల నిర్వహణపై నిర్లక్ష్యం వెలుగుచూసింది. నందికొట్కూరు ఆసుపత్రి వెనుక గోడ వద్ద కాల్చిన బూడిదలో గర్భిణీలు, బాలింతలకు అందించే రక్తవృద్ధి (ఐరన్) మాత్రల పొట్లాలు వందల సంఖ్యలో చెల్లాచెదురుగా కనిపించాయి. రక్తహీనత నివారణతోపాటు గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ మాత్రలను చెత్తలో పడేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పెట్టెపై ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరఫరా.. అమ్మకానికి కాదు’ అని ముద్రించి ఉంది. నిబంధనల ప్రకారం కాలం చెల్లిన మందులను రిజిస్టర్‌లో నమోదు చేసి, ఉన్నతాధికారుల సమక్షంలో సురక్షితంగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. అయితే ఆసుపత్రి వెనుక బహిరంగంగా మందులను కాల్చి, అక్కడే వదిలేయడం వల్ల వీధి కుక్కలు, పశువులు, చిన్నపిల్లలు వాటిని తినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద గర్భిణీలకు అందాల్సిన మందులను ఎందుకు పంపిణీ చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మందులు పంపిణీ చేసినట్లు లెక్కల్లో చూపించి ఇలా తగలబెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును వృథా చేయడంతోపాటు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ఆంధ్రప్రభ విలేకరి డాక్టర్ జెక్కికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు