Kaizer News

AP News | యానాం రేవులో భారీ ధ‌ర ప‌లికిన పుల‌స‌లు..

AP News | యానాం రేవులో భారీ ధ‌ర ప‌లికిన పుల‌స‌లు.. 1.3 కిలోల‌కు రూ.31,500 ధ‌ర‌..!

· State - Telangana · ntnews.com

AP News : ఉభ‌య గోదావరి జిల్లాల్లో పులస చేపల సీజన్ మొదలైంది. తాజాగా మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలు వేలంలో రికార్డు ధర పలికాయి. యానాం రేవులో జరిగిన వేలంపాటలో ఈ రెండు చేపలను కలిపి ఓ మహిళ ఏకంగా రూ.31,500 కు కొనుగోలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మత్స్యకారులకు 1.3 కేజీల బరువున్న రెండు పులస చేపలు చిక్కాయి. వాటికి నిర్వహించిన వేలంలో మత్స్యకార మహిళ పార్వతి పాల్గొన్నారు. ఒక చేపను రూ. 24,000 కు, మరో చేప‌ను రూ.7,500 కు మొత్తం రూ.31,500కు ఆమె దక్కించుకున్నారు. కాగా ఈ ఏడాది మగ పులసకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం దొరికిన 1.250 కేజీల పులస రూ.14,000 పలికింది. ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా పులసల లభ్యత గణనీయంగా తగ్గింది. ఎల్‌నినో ప్రభావంతో గోదావరికి వరదలు ఆలస్యం కావడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి ఎర్ర నీరు వచ్చినప్పుడు పులసల రాక మొదలవుతుంది. కానీ ఈసారి వరదలు ఆలస్యం కావడంతో చేపలు చాలా తక్కువగా వలకు చిక్కుతున్నాయి. దాంతో వీటికి డిమాండ్ పెరిగి వేలంలో భారీ ధరలు ప‌లుకుతున్నాయి. సముద్రంలో ఉండే ఇలస చేప, గుడ్లు పెట్టేందుకు గోదావరి ప్రవాహానికి ఎదురీదుతుంది. ఈ క్రమంలోనే అది పులసగా మారుతుంది. దీని రుచి అద్భుతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పులస కోసం గోదావరి జిల్లాలకు వస్తుంటారు. అరుదుగా దొరకడం, అమోఘమైన రుచి కారణంగానే దీనికి ఇంతటి డిమాండ్ ఏర్పడింది

Original source: ntnews.com
Read more on Kaizer News