Kothagudem: నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చర్యలు చేపట్టి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనుముల సాయి, ఎస్కే ఫహీమ్ దాదా డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెంలోని సీపీఐ కార్యాలయం శేషగిరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో ప్రజలకు అందాల్సిన సేవలు సకాలంలో అందడం లేదని వారు పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ నిరుద్యోగ సమస్యను మరింత పెంచే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు. పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఉచిత కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు, లైబ్రరీలు ఏర్పాటు చేయాలని అన్నారు. మరోవైపు మత్తు పదార్థాలు, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువత బానిసలవుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నియంత్రణపై సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. నిరుద్యోగం, విద్య, ఉపాధి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని ఏఐవైఎఫ్ నాయకులు తెలిపారు. అనంతరం జిల్లా కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించింది. ఈ సమావేశంలో సాధనపల్లి సతీష్, ఎన్‌కే ఖయ్యూం, భూపేష్, ఎండీ నదీమ్, రవికిరణ్, కొచ్చర్ల రాకేష్, నలిగంటి నవీన్, అజయ్, రసూల్, అమీర్, మాణిక్యాల వినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు