Kaizer News

విత్తు కొనడు.. పంట అమ్మడు!

విత్తు కొనడు.. పంట అమ్మడు!

· State - Telangana · ntnews.com

అయిదు సినిమాలకు నిర్మాత.. టెలీ సీరియళ్ల దర్శకుడు.. అయిదు వేళ్లు నోట్లోకి పోవాలంటే డబ్బు ఉంటే సరిపోదని, పంచభూతాల సహకారంతో నవ ధాన్యాలు పండించాలనే సత్యం తెలుసుకున్న మార్గదర్శకుడు. హరిత విప్లవంలో పెరిగిన దిగుబడి లెక్కలు కాదు.. అప్పుల్లో దిగబడి, వడ్డీల చిక్కుల్లో పడి, తిప్పలెన్నో పడుతున్న రైతుల కష్టం తెలిసినవాడు. ఆ దయనీయ జీవితాన్ని డైలీ సీరియల్‌గా తీసి నంది అవార్డు గెలిచాడు. కన్నీటి కథలతో గెలిచిన నంది కంటే గో ఆధారిత సేద్యంతో కష్టాలు తీర్చే మేలైన బాట చూపించాడు. రైతు బిడ్డ రైతు కాని రోజుల్లో సినిమాలు, వ్యాపారాలు చేస్తూ.. చివరికి కర్షకుడిగా అవతారమెత్తాడు. మరెందరో రైతులకు ఖర్చులేని వ్యవసాయం నేర్పాడు. తన పొలాన్నే ప్రయోగశాలగా మార్చి వ్యవసాయ శాస్త్రవేత్తలకు పాఠాలు చెప్పాడు. తన ఫలసాయంతో అనాథల ఆకలి తీరుస్తూ… సాహస యాత్రలాంటి సాగుబాటని సంతోషాల జాతర చేశాడు. ప్రకృతి వ్యవసాయంలో అనుభవాల పచ్చని జ్ఞాపకాలు ఇలా పంచుకున్నాడు! కడుపు చేత పట్టుకుని వచ్చిన వాళ్లకు కాదనకుండా ఆశ్రయమిచ్చి, అన్నం పెట్టే మరో తల్లి హైదరాబాద్‌! యాభై ఏండ్లకు పూర్వం 20 లక్షల మందితో ఉన్న ఈ నగరం జనాభా కోటి దాటిందంటే కారణం ఇది అన్నం పెట్టే ఊరు కావడమే. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఎందరో ఇక్కడికి వచ్చారు. అలా నేనూ వచ్చాను. మాది కర్ణాటకలోని గంగావతి అనే ఊరు. ఒక పత్రికలో జర్నలిస్ట్‌గా పని చేసేందుకు 46 ఏండ్ల కిందట హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. కూర్చున్న చోటే పని చేయడం ఇష్టంలేక మూడో నెలలోనే మానేశాను. ఇక్కడే చిన్న చిన్న వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుంటూ ఉన్నాను. నాలుగేండ్లకు కొంత భూమి కొనాలనే ఆలోచన వచ్చింది. గచ్చిబౌలిలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి కొన్నాను. దానికి తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకున్నాను. వరి, కూరగాయలు పండించాను. ఐటీ కంపెనీల రాక, నగర విస్తరణతో గచ్చిబౌలి కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. వ్యవసాయం చేసే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కౌలు చేస్తున్న భూమి యజమాని దానిని ప్లాట్స్‌గా మార్చి అమ్ముకున్నాడు. ఆ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలంగా లేక మూడెకరాల్లో రెండెకరాలు అమ్మాను. వచ్చిన డబ్బుతో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలోని అమీర్‌పేట్‌ గ్రామం దగ్గర పది ఎకరాల భూమి కొన్నాను. పదెకరాల విస్తీర్ణంలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హార్టికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పండని పండు లేదు! మూడు వందలకు పైగా రకాల పండ్లను ఇందులో పండిస్తున్నారు. ఫుడ్‌ ఫారెస్ట్‌లో రెండున్నర వేల పండ్ల చెట్లున్నాయి. అరవై రకాల అటవీ చెట్లున్నాయి. వీటి సంఖ్య ఏడు వేలు. వీటితోపాటు కూరగాయలు, ఔషధ మొక్కలూ పెంచుతున్నారు. ఫుడ్‌ ఫారెస్ట్‌లో మొత్తం పన్నెండు వేల వృక్షాలు పెరుగుతున్నాయి! హైదరాబాద్‌లో వ్యవసాయం, వ్యాపారాలు చేస్తున్న కాలంలో సినిమా రంగంలోనూ అడుగుపెట్టాను. మా బావమరిది దర్శకత్వంలో అయిదు సినిమాలు నిర్మించాను. రెండిళ్ల పూజారి, జై భజరంగభళి, ఆల్‌ రౌండర్‌, కిష్కింధకాండ నా సినిమాలే. నా దర్శకత్వంలోనే రెండు సీరియళ్లు, ఆరు టెలీఫిల్మ్‌లు తీశాను. వాటికి కథ, స్క్రీన్‌ప్లే కూడా నేనే. ఏడు నంది అవార్డులు గెలిచాను. దూరదర్శన్‌లో మొదటి తెలుగు డైలీ సీరియల్‌ ‘జీవన తీరాలు’ నా దర్శకత్వంలోనే వ

Original source: ntnews.com
Read more on Kaizer News