Kaizer News

Kalwakurthy: బోనాల ఊరేగింపులను రాత్రి 8 గంటలలోపు ప

Kalwakurthy: బోనాల ఊరేగింపులను రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలి!

· State - Telangana · hmtvlive.com

Kalwakurthy: బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే ఊరేగింపుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది బోనాల పండుగ సందర్భంగా ఊరేగింపులో డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన కొందరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్సై కురుమూర్తి హెచ్చరించారు. అనంతరం వారు మళ్లీ ఎలాంటి గొడవలకు పాల్పడకుండా తహసీల్దార్‌ సమక్షంలో ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున బైండ్‌ఓవర్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బోనాల ఊరేగింపుల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో డీజేలు అనుమతి లేదని ఎవరైనా డీజే ఉపయోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిర్వాహకులు తమ తమ ప్రాంతాల్లో నిర్వహించే బోనాల ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో రాత్రి 8 గంటలలోపు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా అందుకు నిర్వాహకులదే పూర్తి బాధ్యత ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై కురుమూర్తి కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News