క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: బల్హర్షా నుంచి కాజీపేట్ వరకు ప్రతిరోజూ నడిచే 17036 కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్‌లో స్టాప్ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రైలు తెల్లవారుజామున 3.50 గంటలకు బల్హర్షా నుంచి బయలుదేరి ఉదయం 8.50 గంటలకు కాజీపేట్ చేరుకుంటుంది. హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో కీలకంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే తమ మండలంలోని మందమర్రి, మంచిర్యాల రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతున్నప్పటికీ మధ్యలో ఉన్న రామకృష్ణాపూర్ స్టేషన్‌లో మాత్రం నిలుపుదల లేకపోవడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణాపూర్ సింగరేణి ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు కాజీపేట్, హైదరాబాద్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. కాజీపేట్ ఎక్స్‌ప్రెస్‌కు రామకృష్ణాపూర్‌లో స్టాప్ లేకపోవడంతో ప్రయాణికులు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని మందమర్రి లేదా మంచిర్యాల స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు చొరవ తీసుకుని రైల్వే అధికారులతో మాట్లాడి 17036 కాజీపేట్ ఎక్స్‌ప్రెస్‌కు రామకృష్ణాపూర్‌లో నిలుపుదల కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు