హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నట్లు తెలంగాణ వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. రాత్రి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. చంద్రాపూర్ నుంచి ప్రారంభమైన వర్షాలు తరువాత కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే నల్లగొండ జిల్లా దేవరకొండ, చందంపేట ప్రాంతాలు, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల, దౌల్తాబాద్ ప్రాంతాలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వానలు కొనసాగవచ్చని తెలిపారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం రానున్న రెండు గంటల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ పేర్కొన్నారు. ప్రజలు వర్షాలు పడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాలా రోజుల తర్వాత మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు జోరందుకున్నాయి. దాదాపు నెలన్నర విరామం తర్వాత కురిసిన వర్షాలతో రైతులు, ప్రజలు ఊరట చెందారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. హన్వాడ – 75.3 మి.మీ. కోయిలకొండ – 47.8 మి.మీ. మిడ్జిల్ – 43 మి.మీ. మాచన్‌పల్లి – 40.5 మి.మీ. జడ్చర్ల – 36.5 మి.మీ. దామరగిద్ద – 25.3 మి.మీ. కొస్గి – 23.5 మి.మీ. మద్దూరు – 20.5 మి.మీ. మరోవైపు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సాయంత్రం వేళ భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, శంషాబాద్, మహేశ్వరం, యాచారం ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది. ఇబ్రహీంపట్నం – 60.3 మి.మీ. యాచారం – 34.3 మి.మీ. కొంగరకలాన్ – 28.3 మి.మీ. మామిడిపల్లి – 12 మి.మీ. అయితే రానున్న రోజుల్లో నగరంతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు