మెట్‌పల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీ అమలు చేయడంతో పాటు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ నాయకులు డిమాండ్ చేశారు. మెట్‌పల్లి మండలంలో నిర్వహించిన పీఆర్టీయూటీఎస్ సర్వసభ్య సమావేశంలో 2026–2028 సంవత్సరాలకు నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 200 మందికి పైగా పీఆర్టీయూటీఎస్ సభ్యులు సమావేశానికి హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా మద్దిరాల గణేష్, ప్రధాన కార్యదర్శిగా కావలి బాలకిషన్, అసోసియేట్ మొదటి అధ్యక్షుడిగా గద్దె సత్యనారాయణ, అసోసియేట్ రెండో అధ్యక్షురాలిగా నాగుల జయలక్ష్మి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నాగెల్లి మల్లేశం, నడిమెట్ల రామకృష్ణ, మహిళా ఉపాధ్యక్షులుగా పుప్పాల శ్రీదేవి, అన్నం శైలజ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా తాటికొండ వినోద్, సంకె రాజశేఖర్, మహిళా కార్యదర్శులుగా బండ్ల శిరీష, మిట్టపల్లి భావన ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మద్దిరాల గణేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకం మరింత బాధ్యతను గుర్తు చేస్తోందని, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కావలి బాలకిషన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతామని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని, తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ప్రతి ఉపాధ్యాయుడికి ధన్యవాదాలు తెలిపారు