‘ఓ పెద్దాయనా.. పెద్ద సారు రావడానికి చాలా టైం పడుతుంది. పోయి రేపు రా’ అన్న అటెండర్ మాటలతో ఆయన ఆ లోకంలోకి వచ్చాడు. వయసు 70 పైబడి ఉంటాయి.. ముఖంలో వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెరిసిన జుట్టు, కళ్లజోడు, పెద్ద గళ్ల చొక్కా, పాతకాలపు ప్యాంటు, భుజాన గుడ్డ సంచి.. అందులో కొన్ని పేపర్లు, సుగర్, బీపీ ట్యాబ్లెట్లు.. నడిచినప్పుడు పట్టు తప్పకుండా ఉండేందుకు ఊతకర్ర. ఇవే ఆయన ఆస్తి. ‘వస్తావ్.. వెళతావ్.. ఏనాడైనా టీ తాగమని పది రూపాయలైనా ఇచ్చావా? పైసల్లేకుండా పని ఎలా అవుతుందనుకుంటున్నావ్’ అన్న అటెండర్ మాటలకు ఓ నిట్టూర్పు విడిచాడు. ఒకప్పుడు ఎంతోమందికి సాయం చేసిన ఈ చేయి ప్రస్తుతం అదే సాయం కోసం దీనంగా అర్ధించే స్థితిలో ఉండటం చూసుకుని నిర్వేదం ఆవహించింది. కలెక్టర్ ఆఫీసులోని ఆ పాత గోడ గడియారం రెండు గంటల సమయాన్ని సూచిస్తోంది. ఇక చేసేదేమీ లేక భారంగా పైకి లేచి అంతే భారంగా అడుగులు బయటకు వేశాడు. ఆయన పేరు రాఘవరావు. తహశీల్దార్ ఆఫీసులో క్లర్క్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఓ కూతురు, ఇద్దరు కొడుకుల బాధ్యతలు అన్నీ నెరవేర్చాడు. భార్య ఉన్నంత కాలం ఆయన జీవితం బానే గడిచింది. కానీ బ్లడ్ కేన్సర్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. తన సహ ధర్మచారిణిని కాపాడుకుందామని రాఘవరావు ఎంతగా తపించినా, బ్లడ్ కేన్సర్ ముందు ఓడిపోయాడు. ఆమె కాలం చేసినప్పటి నుంచి అందరూ ఉన్న అనాథయ్యాడు. ఎప్పుడో ఓసారి కూతురు నుంచి వచ్చే ఫోన్ పలకరింపు తప్ప ఇతర బంధాలేవీ ఆయన దరిదాపుల్లో లేవు. ఇద్దరు కొడుకులు ఉన్నా తండ్రిని పట్టించుకునే తీరిక, పట్టించుకోవాలనే బాధ్యత లేనట్టుగా ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. దీంతో ఆయన జీవితంలాగే రోజులు కూడా చాలా భారంగా గడుస్తున్నాయి. నెలనెలా వచ్చే కాసిని పింఛను డబ్బులతోనే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో తినీ తినక అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కలెక్టరాఫీసు నుంచి బయటకు వచ్చిన రాఘవరావు.. కాస్త అలసటగా అనిపించి ఓ టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగాడు. జేబులో నుంచి రూ.20 నోటు తీసి ఇచ్చి వెళ్లబోయాడు. రాఘవరావులాగే చాలా ముడతలు పడి మాసిపోయి, చిరిగి ఉన్న నోటు వంక టీకొట్టు యజమాని తేరిపార చూసి, ‘ఈ నోటు మారదు మరొకటి ఇవ్వండి’ అంటూ వెనక్కి ఇచ్చాడు. జేబు మొత్తం వెతికి చిల్లరంతా తీసినా కూడా రెండు రూపాయలు తగ్గింది. టీకొట్టు యజమాని వాటిని తీసుకుని.. ‘డబ్బుల్లేకుండా టీ ఎందుకు తాగుతారు’ అంటూ గొణుక్కున్నాడు. రెండు రూపాయలు తగ్గాయని ఆ హోటల్ యజమాని ముఖం తిప్పుకునేసరికి రాఘవరావు మనసు చివుక్కుమంది. కళ్లలో వస్తున్న నీళ్లను బలవంతంగా అదిమి పెట్టుకుని రోడ్డు పైకి వచ్చాడు. జేబులో డబ్బుల్లేవు. ఇంటికి నడిచి వెళ్లేంత ఓపిక అసలే లేదు. ఓ వైపు ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డు తారు కరిగి కాళ్లను గుంజుతున్నట్లుంది. అప్పుడే ఆ రోడ్డుపై నుంచి పోలీస్ జీపు వస్తోంది. అందులో ఉన్న ఎస్సైని రాఘవరావు గుర్తుపట్టారు. ఆయన ఉండేది తమ కాలనీలోనే.. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఎస్సైకి తెలిసిన వాళ్ల ఫైల్ ఒకదానిని త్వరగా పరిష్కరించి సహాయం చేసిన సంగతి గుర్తొచ్చింది. దీంతో లిఫ్ట్ ఇస్తారేమో ఆశతో.. ‘సార్.. కాస్త ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తారా?’ అని చేయి ఊపాడు.