హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయినందున మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తే మంచిదేనని, దీనిపై సీఎం రేవంత్రెడ్డి, ఏఐసీసీదే తుదినిర్ణయం అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. నామినేటెడ్ పదవులు, పార్టీ కమిటీల భర్తీ ప్రక్రియపై సెప్టెంబర్ నాటికి క్లారిటీ వస్తుందని తెలిపారు. కొండా సురేఖపై చర్యల అంశం ఏఐసీసీ పరిధిలో ఉందని.. సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించి ఆ పదవిని ఆశించే దీనస్థితిలో తాను లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతర్గత విభేదాలు అన్ని పార్టీల్లోనూ ఉంటాయని, కానీ అది పాలనపై పడడం లేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత బీఆర్ఎస్ సోషల్మీడియాలో తప్ప బయటలేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల బలంతో వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వీ6 వెలుగు ఇంటర్వ్యూ’లో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల్లో జరిగేదే మా పార్టీలోనూ జరుగుతున్నది. విభేదాలు అస్సలు లేవని నేనేమీ అనను, ప్రతి పార్టీలోనూ ఉంటాయి. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కాస్త బయటకు కనిపిస్తాయి. మిగతా పార్టీల్లో అర్ధరాత్రి డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుంచి తీసేసినా ఎవరికీ కారణం తెలియదు. అమిత్ షా, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడి బీజేపీలో ఉండగలరా? కానీ కాంగ్రెస్‌లో నెహ్రూ, ఇందిరా గాంధీని విమర్శించిన వాళ్లు కూడా కేబినెట్‌లో కొనసాగారు. అదే ప్రజాస్వామ్యం.అయితే ఏ స్వేచ్ఛకైనా హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటినప్పుడు చర్యలు తప్పవు. ఈ వ్యవహారం వల్ల కొంత నష్టం జరుగుతోందనే నివేదికను కమిటీ ఇచ్చింది. క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంతా సమానమే. చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చాం. గతంలో కులాల విషయంలో ఇబ్బందికరంగా మాట్లాడిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశాం. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య, పార్టీ-ప్రభుత్వం మధ్య సఖ్యత లేదనే వాదన ఎందుకు వస్తోంది? ప్రతి పార్టీలోనూ ఇలాంటి పరిణామాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు కప్పిపుచ్చుకుంటాయి, మా దగ్గర స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మాట్లాడతారు. బీజేపీలోనూ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య విభేదాలు వస్తే అధిష్టానం సయోధ్య కుదిర్చిన విషయం చూశాం. ఆ రోజు సురేఖ కుమార్తె మాట్లాడిన తీరు బాధాకరం. రేవూరి ప్రకాశ్ రెడ్డి సభలో సీఎం మాట్లాడినంత మాత్రాన టికెట్ ఇచ్చినట్టు కాదు. టికెట్లకు డీసీసీ, పీఈసీ, సీఈసీ అనే ఎంపిక విధానం ఉంటుంది. అంత తొందరపడి మాట్లాడాల్సింది కాదు. తప్పు ఏమిటనేది ఏఐసీసీ పరిశీలిస్తుంది. గతంలోనూ రాహుల్ గాంధీపై శశిథరూర్ మాట్లాడారు, అంతమాత్రాన అందరిపైనా చర్యలు తీసుకోలేదు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లాంటి వాళ్లూ కామెంట్లు చేశారు కదా? మరి వారిపై ఎందుకు చర్యలు లేవు? రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిని వివరణ అడిగాం. వారు వివరణ ఇచ్చారు. ఇదొక నిరంతర ప్రక్రియ. గతంలో ఎన్నికలకు ముందు ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్నికల నాటికి అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి త