Kaizer News

Labbipet: విజయవాడలో నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్ల మహ

Labbipet: విజయవాడలో నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్ల మహాధర్నా

· State - Telangana · hmtvlive.com

Shorts విజయవాడ, లబ్బీపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ వెటర్నరీ వైద్యులు ఈరోజు విజయవాడ లబ్బీపేటలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా నిరుద్యోగ వెటర్నరీ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మూడు రోజుల వ్యవధిలో పశువైద్యుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన వివిధ జీవోలపై నిరుద్యోగ వెటర్నరీ వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీవో నం.52 అమలును నిలిపివేయడం, అనంతరం కొత్త నియామక విధానాన్ని తీసుకురావడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 సంవత్సరాలుగా పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ప్రత్యక్ష నియామక విధానం ద్వారా భర్తీ అవుతున్నాయని, అయితే ప్రస్తుతం ఆ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకురావడం తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిరుద్యోగ వెటర్నరీ వైద్యులు పేర్కొన్నారు. జీవో నం.52లో నిర్దేశించిన విధానంలో సీనియారిటీ, ప్రభుత్వ/కాంట్రాక్ట్ సర్వీస్, పీజీ విద్యార్హత, యూజీ గ్రేడ్ తదితర అంశాలకు వెయిటేజీ ఇచ్చి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టే విధానం ఉందని వారు తెలిపారు. ఈ ప్రమాణాలకు అర్హత సాధించేందుకు అనేక మంది వెటర్నరీ వైద్యులు గత 8–10 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ మరియు ఇతర తాత్కాలిక విధానాల్లో తక్కువ వేతనాలతో సేవలందిస్తున్నారని తెలిపారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న నియామక విధానంలో ఆకస్మికంగా మార్పులు తీసుకురావడం వల్ల తమ దీర్ఘకాలిక సేవ, పీజీ విద్యార్హతలు మరియు అనుభవానికి విలువ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన జీవో నం.24 ద్వారా APPSC పరీక్ష ఆధారిత కొత్త నియామక విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించి, జీవో నం.24ను ఉపసంహరించుకుని, గతంలో అమలులో ఉన్న నియామక విధానాన్ని కొనసాగించాలని నిరుద్యోగ వెటర్నరీ వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో 8–10 సంవత్సరాలుగా సేవలందిస్తున్న వెటర్నరీ వైద్యుల సర్వీస్‌కు తగిన గుర్తింపు కల్పించాలని, వారి పీజీ విద్యార్హతలు, అనుభవం మరియు గత సేవలకు ఎలాంటి నష్టం కలగకుండా నియామక ప్రక్రియను రూపొందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే, తదుపరి దశలో విస్తృత ఉద్యమంతో పాటు న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమవుతామని నిరుద్యోగ వెటర్నరీ వైద్యులు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 100 మందికి పైగా నిరుద్యోగ వెటర్నరీ వైద్యులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News