నాలుగు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు.. డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ 2026 పరీక్ష జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్‌లోని శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ సమీపంలోని వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసన్నపేట మారుతీనగర్–2లోని కోర్ టెక్నాలజీస్, టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అభ్యర్థుల రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్ నిఘాను వినియోగించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ పరీక్ష సజావుగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసుల సమర్థవంతమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పర్యవేక్షణ చర్యలతో నీట్–పీజీ 2026 పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది