నరసాపురం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఆదివారం పరిశీలించారు. నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, అనంతరం గోదావరి పుష్కర ఘాట్లను మరపడవలో ప్రయాణించి పరిశీలించారు. మొగల్తూరులో ప్రజాసభ వేదిక, హెలిప్యాడ్, కేడర్ సమావేశం జరిగే ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, సభా ప్రాంగణాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు