Kaizer News

Tuni: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి టీడీపీ శ

Tuni: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి టీడీపీ శ్రేణులకు యనమల పిలుపు!

· State - Telangana · hmtvlive.com

Tuni: రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సర్వసద్ధంగా ఉండాలని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో విశ్వాస భావం మెండుగా ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో తుని పట్టణ సీనియర్ నేతలతో ఆయన తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తుని మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డుల్లో గెలుపు గుర్రాల జాబితాపై ఈ సమావేశంలో కూలంకషంగా సమీక్షించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, పార్టీకి విధేయులుగా ఉన్నవారికే అగ్రతాంబూలం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఆశావహుల జాబితా ఎలా ఉన్నప్పటికీ, భవిష్యత్ రాజకీయాలకు మరియు పట్టణాభివృద్ధిలో క్రియాశీలకంగా మమేకమయ్యే వారికే ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఒక్కో వార్డు నుంచి నాలుగైదు పేర్లతో కూడిన జాబితాను ప్రతిపాదించాలని కోరిన ఆయన, సమర్థులకే పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. పట్టణంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు మున్సిపల్ కౌన్సిల్‌లో సముచిత ప్రాతినిధ్యం లభించేలా అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ఉండాలని యనమల సూచించారు. అంతేకాకుండా, ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసి వెళ్లాల్సి ఉన్నందున సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు వెలువడే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని, ఒకవేళ విపక్షాలు అరాచకాలకు పాల్పడితే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్, పాత బజార్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News