Kaizer News

ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ కు మరో షాక్​.. ఎంఐఎం

ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ కు మరో షాక్​.. ఎంఐఎం పార్టీ సభ్యత్వం రద్దు

· State - Telangana · telugu.oneindia.com

హైదరాబాద్‌ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివాదాస్పద వీడియోల వ్యవహారంలో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్ ‌ను ఇప్పటికే ఎంఐఎం పార్టీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఆ పార్టీ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్​ ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెంటనే శాసన మండలి ఛైర్మన్‌ కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అత్తాపూర్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో మీర్జా రహమత్ బేగ్‌ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై ఏఐఎంఐఎం జాయింట్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ ఎక్స్ లో ఈ విధంగా పోస్టు చేశారు. మీర్జా రహమత్ బేగ్‌ ను ఏఐఎంఐఎం నుంచి తక్షణమే బహిష్కరించడం జరిగింది.. ఆయన వెంటనే శాసన మండలి ఛైర్మన్‌ కు తన రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది.. అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్‌ నుంచి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ ను ఎందుకు బహిష్కరించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అర్ధరాత్రి సస్పెండ్‌ చేయడం వెనుక మర్మమేంటని ప్రశ్నలు సంధించారు. మరోవైపు ఈ అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తాజాగా స్పందించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో బేగ్ ప్రమేయం ఉందని కీలక ఆరోపణలు చేశారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు మౌనం వహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగ్‌ ఎమ్మెల్సీ గెలుపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ సాయపడ్డాయని ఆయన కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఈ అంశంపై ఆయా పార్టీలు ఇప్పుడు బహిరంగంగా స్పందించాలని డిమాండ్ చేశారు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News