కస్తూరిబా గాంధీ హైస్కూల్‌లో న్యాయ అవగాహన సదస్సు డ్రగ్స్, సోషల్ మీడియా ప్రభావంపై విద్యార్థులకు అవగాహన నర్సాపురం, ఆంధ్రప్రభ: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టాలని న్యాయవాదులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా గాంధీ ఉన్నత పాఠశాలలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పిల్లలను చెడు మార్గం వైపు పురికొల్పే డ్రగ్స్, సోషల్ మీడియా ప్రభావం అనే అంశాలపై విద్యార్థులకు విపులంగా వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లం రాజు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఐ. జాన్ కెనడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను సన్మానించే విధంగా విద్యార్థి దశను పూర్తి చేయాలని, సెల్‌ఫోన్లను అవసరమైనంత వరకే ఉపయోగించాలని సూచించారు. తలదించుకుని చదివితే ఆకాశానికి గొప్ప వెలుగుగా నిలుస్తారని, చదువులోనైనా, ఆటల్లోనైనా లక్ష్య సాధన దిశగా కృషి చేసి విజయాన్ని సాధించాలని అన్నారు. డ్రగ్స్ మాఫియా ముఖ్యంగా విద్యార్థుల ద్వారానే వ్యాపారాన్ని కొనసాగిస్తోందని, కాబట్టి డ్రగ్స్ మాఫియాకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యదర్శి కె. సోమశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు వచ్చే దారిలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పెద్దవాళ్లు లేకుండా బీచ్‌లకు వెళ్లకూడదని సూచించారు. ప్యానెల్ లాయర్ ఎన్. శ్రీనివాసరావు నేర ప్రవృత్తిని ప్రేరేపించే ఆన్‌లైన్ గేమ్స్, యూట్యూబ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. లాయర్ బి. ప్రగతి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు వారు మోటార్ బైక్ నడపడం చట్టరీత్యా నేరమని, ఆడపిల్లలు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోరాదని, పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మరో లాయర్ కె. శిరీష మాట్లాడుతూ విద్యార్థులు, గ్రామ స్థాయిలో ఇప్పటికీ జరుగుతున్న బాల్య వివాహాలను వ్యతిరేకించాలని, పూర్వకాల పరిస్థితులను పెద్దవారిని అడిగి తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. ఆదర్శవంతులైన, చరిత్ర కలిగిన వారి జీవిత చరిత్రలను నిత్యం తెలుసుకోవాలని, భారత రాజ్యాంగం, హక్కులు, విధులు అందరూ తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సోమేశ్వరరావు, పారా లీగల్ వాలంటీర్లు ఎం. విజయ్‌కుమార్, ఎన్. ప్రతిభారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు