ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశంలో రాజకీయాలను సమూలంగా మార్చే శక్తి యువతకు ఉందా..? ఈ ప్రశ్నకు ముందు, దేశంలో ఎన్నికలను యువతరం ఎంతమేర ప్రభావితం చేయగలుగుతుంది..? అన్న ప్రశ్నకు జవాబు రాబట్టాలి. ఇప్పటివరకున్న సమాచారం, హేతుబద్ధ విశ్లేషణలను బట్టి చూస్తే కచ్చితంగా ‘అవును’ అని చెప్పే స్థితి లేదు. దేశంలో సుమారు ఏకకాలపు 50 రోజుల ఓ యువజనోద్యమ భావోద్వేగాలు, మరో 50 రోజుల సర్వే ఫలితాల వ్యత్యాసాలే ఇందుకు నిదర్శనం. జంతర్ మంతర్ కేంద్రంగా దేశమంతా జరిగిన యువ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, నేలకు దించింది. అదే వరసలో మరో 55 ( జులై1- ఆగస్టు 25) రోజులపాటు సాగిన ఇండియా టుడే సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఫలితాలు అందుకు విరుద్ధంగా కేంద్రంలోని ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పరస్పర విరుద్ధ సంకేతాలు యువత నిరసన వేరు, వారి ఓటింగ్ సరళి వేరని చెప్పకనే చెబుతున్నాయి. భారత ఎన్నికల రాజకీయాల్లో యువత ఎప్పటినుంచో కీలక ఓటుబ్యాంకుగా పరిగణించడం జరుగుతోంది. దేశ జనాభాలో యువత వాటా (60 %) భారీగా ఉండటంతో ప్రతి రాజకీయ పార్టీ వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఉద్యోగాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పరీక్షలు, స్టార్టప్‌లు, డిజిటల్ ఆర్థికవ్యవస్థ వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అయితే యువత సంఖ్య ఎక్కువగా ఉండటం ఒక్కటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా..? యువత నిజంగా పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారా..? వారి ఓటింగ్ ధోరణి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది..? అనే ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల విశ్లేషణలో యువ ఓటర్లను ఒకే సమూహంగా పరిగణించడం సరైనది కాదు. 18–21, 22–25, 26–28 వంటి వయసు గ్రూపుల్లో రాజకీయ అభిప్రాయాలు, ఓటింగ్ ఆసక్తి, ఎన్నికల భాగస్వామ్యం మారుతుంటాయి. అందువల్ల ‘యువత ఈ పార్టీ వైపు ఉంది’ అనే సాధారణ అంచనాల కంటే వయసు, ప్రాంతం, సామాజిక నేపథ్యం, విద్య, ఉద్యోగ స్థితి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, లోక్‌నీతి సంస్థ డైరెక్టర్ డా. సంజయ్ కుమార్ అంటారు. యువతకు ఓటు వేయాలనే ఆసక్తి, నిజంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం మధ్య ఉన్న తేడా ముఖ్యం. సోషల్ మీడియాలో ఒక రాజకీయ అంశంపై పెద్ద ఎత్తున స్పందించడం, నిరసనల్లో పాల్గొనడం లేదా ఒక పార్టీకి మద్దతు ప్రకటించడం తప్పనిసరిగా ఎన్నికల రోజున ఓటుగా మారదు. 2024 లోక్‌సభ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే యువ ఓటర్ల పోలింగ్‌లో రాష్ట్రాల మధ్య గణనీయమైన తేడాలు కనిపిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో 18-–21 వయసు ఓటర్ల పోలింగ్ రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో యువత పోలింగ్ మొత్తం రాష్ట్ర సగటును మించిపోయింది. బిహార్‌లో 18–-21 వయసు యువత పోలింగ్ సుమారు 41 శాతంగా ఉండగా, రాష్ట్రం మొత్తం పోలింగ్ 67.3 శాతంగా నమోదైంది. యూపీలో యువత పోలింగ్ సుమారు 51 శాతంగా ఉండగా, రాష్ట్ర సగటు 61.1 శాతంగా ఉంది. అంటే ఈ రెండు పెద్ద రాష్ట్రాల్లో యువతకు ఉన్న రాజకీయ ప్రాధాన్యానికి అనుగుణంగా వారి పోలింగ్ కనిపించలేదని చెప్పవచ్చు.