Kaizer News

అంతా బాగున్నప్పుడు ఎందుకు తప్పించారు?

అంతా బాగున్నప్పుడు ఎందుకు తప్పించారు?

· Sports · ntnews.com

టీ20 కెప్టెన్సీ, జట్టు నుంచి తొలగించడంపై తొలిసారి స్పందించిన సూర్యకుమార్‌ న్యూఢిల్లీ: భారత్‌కు టీ20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌ అందించి.. రెండేండ్ల పాటు ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోకుండా జట్టును నడిపించిన తనను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి నోరువిప్పాడు. ఆ నిర్ణయంతో షాక్‌కు గురయ్యానని, దాదాపు 40-50 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయానని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత జరిగిన యూకే టూర్‌కు సూర్యను జట్టు నుంచి తప్పించిన సెలెక్టర్లు శ్రేయస్‌ అయ్యర్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పును తాను అస్సలు ఊహించలేదని సూర్య తెలిపాడు. ‘జట్టుకు దూరమయ్యాక 40-50 రోజులు ఇంట్లోనే కూర్చుండిపోయా. అసలు ఏం చేయాలో తోచలేదు. నేను క్రికెట్‌ ఆడాలా? వద్దా? అనే ఆలోచనలు కూడా వచ్చాయి. ఆ సమయంలో నా భార్య నాతో మాట్లాడింది. నువ్వు 20 ఏళ్ల క్రితం ఆటను ఎందుకు మొదలుపెట్టావో ఒకసారి గుర్తుచేసుకో.. ఈ ఆటపై ఉన్న పిచ్చి కోసమే కదా! ఆ పాత పట్టుదలను మళ్లీ బయటకు తీయి అంటూ ఆమె చెప్పిన మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి‘ అని సూర్య వెల్లడించాడు. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు తన మద్దతు ప్రకటించాడు. కాకపోతే అంతా బాగున్నప్పుడు, వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు మార్పు ఎందుకనే ఆలోచన తనను వేధించిందని చెప్పాడు. ‘కెప్టెన్సీ మార్పును నేను ఊహించలేదు. రాబోయే ఒలింపిక్స్‌, తదుపరి టీ20 ప్రపంచకప్‌ వరకు జట్టును తీర్చిదిద్దాలని భావించా. కానీ యాజమాన్యం భవిష్యత్తు కోసం వేరేలా ఆలోచించి నిర్ణయం తీసుకుంది’ అని సూర్య వివరించాడు

Original source: ntnews.com
Read more on Kaizer News