Kaizer News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..

· State - Telangana · prabhanews.com

ఈ నెల 23, 24 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. సోమవారం నాటికి ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 23 లేదా 24 నాటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండం లేదా తుఫాన్‌గా మారే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ వాతావరణ వ్యవస్థ బుధవారం ఉదయానికి పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని కోరింది. కొత్తగా ఎవరూ వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News