వెలిగొండ తొలిదశ జాతికి అంకితం సాగునీటికి కొత్త భరోసా వెలిగొండ తొలిదశ ప్రారంభం AP | ఆంధ్రప్రభ, మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం జాతికి అంకితం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని గంటవానిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతాంగానికి సాగునీటి లభ్యత లక్ష్యంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ గేట్లను ఎత్తి నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు మరింత అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పరిసరాల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై వెలిగొండ తొలిదశ ప్రారంభాన్ని వీక్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు… రైతులు.. మహిళలు., సభా ప్రాంగణంలో ఆకుపచ్చ కండువాలను గాల్లోకి తిప్పుతూ వెలిగొండ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రైతులు, ప్రజలు స్వచ్ఛంధంగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున సభకు నిర్వాసితులు హాజరయ్యారు. 30 ఏళ్ల కల సాకారం కానుండడంతో మార్కాపురం, ప్రకాశం జిల్లా వాసుల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం… వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు… అధికారులు ఘన స్వాగతం పలికారు. మార్కాపురం జిల్లా ప్రజల 30ఏళ్ల చిరకాల వాంఛను నెరవేర్చినందుకు మార్కాపురం ప్రజలు, రైతుల పక్షాన ముఖ్యమంత్రికి మార్కాపురం జిల్లా ప్రజా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం ప్రాంతానికి నీటి వసతి కలిగితే వలసలు ఉండవని.. అభివృద్ధి జరుగుతుందని ప్రజా ప్రతినిధులు అన్నారు. ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తుండడంతో ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సీఎంకు ప్రజా ప్రతినిధులు తెలిపారు. మార్కాపురానికి ప్రత్యేక జిల్లాగా చేయడం.. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడత నీటి విడుదల జరగడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి చెప్పారు. సాంప్రదాయ పద్దతిలో పంచకట్టుతో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు