రెండు నెలలుగా తెగిపడిన వైర్లు.. పట్టించుకోని అధికారులు చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం శివారులోని వ్యవసాయ చేనులో రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపోయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కైలాపూర్ శివారులో వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ వైర్లు నేలపై తెగిపడి ఉన్నాయి. విద్యుత్ స్తంభం విరిగిన విషయాన్ని అప్పటి నుంచే సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని బాధిత రైతులు చేరి సునీత, కోడెల రాజమల్లు తెలిపారు. వైర్లు నేలపై ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో చుట్టుపక్కల వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసేందుకు అవసరమైన విద్యుత్ అందక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి విరిగిన స్తంభం స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ వైర్లను సక్రమంగా అమర్చి, నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని బాధిత రైతులు చేరి సునీత, కోడెల రాజమల్లు, ఇతర రైతులు విజ్ఞప్తి చేశారు