Razole: డిజిటల్ ఇండియా, 5జీ సేవలతో గ్రామీణ ప్రాంతాలకు సైతం అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలకు మాత్రం మొబైల్ సిగ్నల్ సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఒక ఫోన్ కాల్ మాట్లాడాలన్నా, అత్యవసర సమయంలో 100, 108కు కాల్ చేయాలన్నా గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో సిగ్నల్ కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి రావడం వల్ల తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ సెలవులకు స్వగ్రామాలకు వచ్చే యువత సైతం నెట్‌వర్క్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌టెల్ సిగ్నల్ అందుకోవడం కోసం కొందరు ఇళ్లపై పెద్ద పెద్ద కర్రలను ఏర్పాటు చేసి, వాటి చివర మొబైల్ ఫోన్లను ఉంచి సిగ్నల్ కోసం ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లలో అయితే ఒక్క సిగ్నల్ పాయింట్ కోసం గంటల తరబడి ఎదురుచూడటం నిత్యకృత్యంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఫోన్ కాల్స్‌తో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా సక్రమంగా అందక విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. డిజిటల్ యుగంలోనూ కనీస మొబైల్ సిగ్నల్ కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎయిర్‌టెల్ సంస్థ యాజమాన్యం తక్షణమే స్పందించి ఆయా గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు