హై లెవెల్ వంతెనకు నిధులు మంజూరు చేయాలి: రఘునాథ్ వెరబెల్లి దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం మాకులపేట గ్రామానికి వెళ్లే మార్గంలోని వాగుపై ఉన్న వంతెన దెబ్బతిని గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మండిపడ్డారు. సోమవారం ఆయన మాకులపేట గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. ప్రజల రాకపోకలకు కీలకంగా ఉన్న వంతెన పరిస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదా? ప్రభుత్వం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. వర్షాకాలంలో వాగుకు వరదలు వస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమైన నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు, రాకపోకలకు సంబంధించిన సమస్యపై కూడా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని రఘునాథ్ వెరబెల్లి అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వంతెన పరిస్థితిని పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకు సరైన స్పందన లేకపోవడం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందన్నారు. మాకులపేట గ్రామ ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలంటే హై లెవెల్ వంతెన నిర్మాణమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే గ్రామ ప్రజల తరఫున బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు