అధికారుల పర్యవేక్షణ కరువు.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన ఉరవకొండ, ఆంధ్రప్రభ : నిరుపేద విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో హాస్టళ్ల నిర్వహణ సక్రమంగా సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది వార్డెన్లు తమ ఇష్టానుసారం హాస్టళ్లను తెరుస్తున్నారని, సెలవు రోజుల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచకుండా తాళాలు వేసి వెళ్లిపోతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల గ్రామ బీసీ బాలుర సంక్షేమ హాస్టల్ నిర్వహణ అధ్వానంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం హాస్టల్‌కు తాళాలు వేసి వెళ్లారని తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు, వసతులు అందడం లేదని ఆరోపించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, ప్రతి ఆదివారం చికెన్ బిర్యానీ కూడా చాలీచాలని పరిమాణంలో వడ్డిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం సక్రమంగా అందడం లేదని వాపోయారు. విద్యార్థులను రాత్రివేళల్లో సొంత ఇళ్లకు పంపించి అధికారులు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ నిర్వహణపై దృష్టి సారించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏబీసీడబ్ల్యూఓ మస్తాన్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం సందర్భంగా హాస్టల్‌కు తాళాలు వేశారని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు