మూడు ప్రధాన పార్టీల్లో మొదలైన కసరత్తు కాంగ్రెస్‌కు వరుస విజయాల జోష్.. పాత పట్టు కోసం బీఆర్‌ఎస్ వ్యూహం.. 2014 గెలుపును పునరావృతం చేయాలని బీజేపీ యత్నం ఖైరతాబాద్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఫోకస్.. టికెట్ రేసులో పలువురు నేతలు ఉప ఎన్నిక వస్తే బరిలో ఎవరెవరు?.. అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో ఉత్కంఠ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, విజయారెడ్డికి చాన్స్? బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరుపై చర్చ.. మన్నె గోవర్ధన్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో.. గులాబీ పార్టీలో ఆసక్తికర సమీకరణాలు బీజేపీ నుంచి చింతలకే ఛాన్స్‌నా?.. మరోసారి బరిలోకి దింపే యోచన హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఖైరతాబాద్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కోర్టు స్పష్టం చేసింది. తాజాగా దానం నాగేందర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఒకవేళ సుప్రీంకోర్టు నుంచి స్టే రాకపోయి, ఖాళీ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తే.. హైదరాబాద్ రాజకీయాల్లో మరో కీలక పోరుకు తెరలేచినట్టే. అయితే ఇప్పటివరకు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించలేదు. అసెంబ్లీ నుంచి ఖాళీ సమాచారాన్ని స్వీకరించిన తర్వాత ఎన్నికల సంఘం తదుపరి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి హైదరాబాద్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ నేత పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్)కు ఈ నియోజకవర్గం బలమైన రాజకీయ స్థావరంగా ఉండేది. పీజేఆర్ 1978, 1985, 1989, 1994, 2004లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2007లో ఆయన మరణం తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు మారాయి. 2009లో దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014లో బీజేపీకి చెందిన చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 2018లో దానం నాగేందర్ టీఆర్‌ఎస్ తరఫున తిరిగి గెలిచారు. 2023లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా 67,368 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డికి 45,358 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 38,094 ఓట్లు వచ్చాయి. అంటే గత కొన్నేళ్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు పార్టీలూ ఈ సీటులో తమ ముద్ర వేసిన సందర్భాలున్నాయి. అందుకే ఉప ఎన్నిక జరిగితే అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారనుంది. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో ప్రధాన చర్చ దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తుపైనే సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానం తిరిగి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? లేక పార్టీ మరో అభ్యర్థిని ఎంపిక చేస్తుందా? అన్నది ప్రస్తుతం స్పష్టంగా లేదు. దానం నాగేందర్ మాత్రం ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్లీ పోటీకి సిద్ధమని బహిరంగంగానే చెప్పార