పశ్చిమ ప్రకాశం ఫ్లోరైడ్, కరువుకు కృష్ణా జలాలు కీలకమయ్యాయి. పూల సుబ్బయ్య కృష్ణానది జలాల మళ్లింపునకు జీవితాంతం పోరాడారు. నల్లమల సొరంగాల ద్వారా జలాలు తరలించాలని బృహత్తర ఉద్యమం నడిపారు. ఆయన కృషికి గుర్తింపుగా వెలిగొండ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. Who is Pula Subbaiah: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగానికి సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కనిపిస్తాయి. అయితే, వాటిలో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్ధాల కలల సాకారమైన వెలిగొండ ప్రాజెక్టు అత్యంత విశిష్టమైంది. దశాబ్ధాలుగా ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకుని, కనీసం తాగడానికి చుక్క నీరు లేక, వ్యవసాయానికి సాగునీరు అందక నరకయాతన అనుభవించిన ఆ కరవు నేలకు కృష్ణా నది జలాలను తరలించే ఒక మహా యజ్ఞమే ఈ ప్రాజెక్టు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన కొండలను తొలిచి, అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన సుదీర్ఘమైన ట్విన్ టన్నెల్స్ ద్వారా శ్రీశైలం ఫోర్షోర్ నుంచి నీటిని మళ్లించే ఈ భారీ ప్రాజెక్టు పేరు వినగానే తెలుగు ప్రజల మదిలో మెదిలే ఏకైక పేరు - పూల సుబ్బయ్య. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంటేనే కరవు కాటకాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచేది. ముఖ్యంగా మార్కాపురం, యర్రగొండుపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉండేది. తాగడానికి కనీసం గుక్కెడు మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడిపోయేవారు. నీటి కోసం వందల అడుగుల లోతుకు బోర్లు వేసినప్పటికీ, ఆ బోరు బావుల నుంచి వచ్చే నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ఫ్లోరైడ్ మూలకాలు ఉండటం ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. ఈ విషపూరితమైన ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల చిన్న వయసులోనే పిల్లల పళ్లు పసుపు రంగులోకి మారిపోయేవి. ఎంతో మంది ప్రజలు ఎముకల బలహీనతతో కాళ్లు చేతులు వంకర్లు పోయి శారీరక వైకల్యానికి గురయ్యేవారు. గ్రామానికి గ్రామాలే వికలాంగుల ఆవాసాలు దర్శనమిచ్చేవి. ఆ ప్రాంత ప్రజల ఘోరమైన కష్టాలను, వారి శారీరక నరకయాతనను కళ్లారా చూసిన పూల సుబ్బయ్య పరిష్కార మార్గాల కోసం వెతికారు. కృష్ణా నదీ జాలలను తమ మెట్ట ప్రాంతానికి తరలించడమే మేలని నమ్మారు. శ్రీశైలం జలాశయం నిండిన ప్రతీసారి వరద నీరు వృథాగా సముద్రంలోకి కలిసిపోతుందని గ్రహించి వాటిని నల్లమల కొండల అవతలి వైపు ఉన్న తమ కరవు పీడిత ప్రాంతాలకు మళ్లించవచ్చని పట్టుబట్టారు. పూల సుబ్బయ్య సీపీఐకు చెందిన ఈ అగ్రనేత అత్యంత సాధారణ, నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే నిరుపేదల సమస్యలను చూస్తూ పెరిగిన ఆయన, విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై గళమెత్తారు. ఆయన నిబద్ధను గుర్తించిన ప్రజలు ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ పూల సుబ్బయ్య తనకంటూ ఆస్తులు సంపాదించుకోలేదు. సాధారణ ప్రజల కంటే సింపుల్‌గా జీవించారు. పశ్చిమ ప్రకాశం మెట్ట ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ధ్యేయంగా ఆయన తన జీవితాంతం పాదయాత్రలు, ధర్నాలు చేశారు. అసెంబ్లీ లోపల, వెలుపల కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. నల్లమల దట్టమైన అడవ