Kaizer News

3 Idiots controversy | సోనమ్ వాంగ్‌చుక్ షాకింగ్ కా

3 Idiots controversy | సోనమ్ వాంగ్‌చుక్ షాకింగ్ కామెంట్స్.. ఆమీర్ ఖాన్‌కు గజినీతో కౌంటర్!

· Entertainment · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ‘3 ఇడియట్స్’ సినిమా.. ఆమీర్ ఖాన్, సోనమ్ వాంగ్‌చుక్ మధ్య సంబంధం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తనకు వాంగ్‌చుక్‌తో పరిచయమే లేదంటూ ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై లడఖీ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆసక్తికరంగా స్పందించారు. అంతేకాదు.. ఆమిర్ ఖాన్ నటించిన ‘గజినీ’ సినిమాను ప్రస్తావిస్తూ ఆయన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ సినిమాల జాబితాలో ‘3 ఇడియట్స్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఆమీర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విద్యా వ్యవస్థపై చర్చకు తెరతీసింది. ముఖ్యంగా ఆమీర్ పోషించిన ‘రాంచో’ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలోని ఫున్‌సుఖ్ వాంగ్డు పాత్రకు సోనమ్ వాంగ్‌చుక్‌నే స్ఫూర్తి అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘3 ఇడియట్స్’ సినిమా రూపొందుతున్న సమయంలో తనకు సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదని, తాను ఆయనను కలవలేదని చెప్పారు. అంతేకాదు, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, రచయిత అభిజాత్ జోషికి కూడా అప్పట్లో వాంగ్‌చుక్ గురించి తెలియదని ఆమిర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. ఓ యూట్యూబర్ తో జరిగిన సంభాషణలో సోనమ్ వాంగ్‌చుక్‌కు సంబంధించిన ఓ పాత వీడియోను చూపించారు. ఆ వీడియోలో ఆమీర్ ఖాన్ కూడా ఓ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. దీనిపై వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ‘3 ఇడియట్స్’ కంటే ముందే తాను ఆమీర్ ఖాన్‌ను కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో తాము చాలాసేపు మాట్లాడుకున్నామని, అనేక విషయాలపై చర్చించుకున్నామని తెలిపారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. ఆమీర్ ఖాన్ పాత్రల్లో ‘గజినీ’లోని సంజయ్ సింఘానియా పాత్రకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ సరదాగా ఆమీర్ పై సెటైర్ వేశారు. ఆమీర్ తన పాత్రల్లో పూర్తిగా లీనమైపోతారని తాను విన్నానని, బహుశా ‘గజినీ’ సినిమాలో పాత్రలో అంతగా లీనమైపోయి ఉండొచ్చని వాంగ్‌చుక్ చమత్కరించారు. అందుకే తాము కలిసిన విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి ఉండొచ్చని నవ్వుతూ వ్యాఖ్యానించారు. వాంగ్‌చుక్ చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది

Original source: prabhanews.com
Read more on Kaizer News