Nandigama: నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రజల వద్దకే నేరుగా పాలన అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో వాటికి పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సౌమ్య హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని అధికారులు బాధ్యతగా స్వీకరించి, నిబంధనల మేరకు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా దర్బార్లు మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు