Kaizer News

కనకదుర్గమ్మకు స్వర్ణ ‘జడ’ కానుక

కనకదుర్గమ్మకు స్వర్ణ ‘జడ’ కానుక

· State - Telangana · prabhanews.com

ఏళ్ల నాటి మొక్కు తీర్చుకున్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు రూ.11 లక్షల విలువైన 120 గ్రాముల మేలిమి బంగారంతో తయారీ.. జడలో 19 లక్ష్మీదేవి ప్రతిమలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు ఇటీవల 46 మంది భక్తుల నుంచి రూ.1.16 కోట్ల ఆభరణాలు, విరాళాలు రూ.75 లక్షలతో స్వర్ణ కిరీటం చేయిస్తున్న హైదరాబాద్‌ పారిశ్రామికవేత్త.. ఆలయ సేవలపై సీఎం ప్రశంసలు.. దుర్గ గుడి చైర్మన్ బొర్రా గాంధీ. .. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు ఆదివారం స్వర్ణ జడను సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. సుమారు రూ.11 లక్షల విలువైన 120 గ్రాముల మేలిమి బంగారంతో రూపొందించిన జడను అమ్మవారికి సమర్పించారు. జడలో 19 లక్ష్మీదేవి ప్రతిమలను పొందుపరిచారు. స్వర్ణాభరణాలు ఆలయానికి తీసుకువచ్చిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులను ఈవో శీనా నాయక్ ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ దంపతులు బంగారు ఆభరణాలను ఈవో అందజేశారు. అమ్మవారిని సామాన్య భక్తుడిగా దర్శించుకునేందుకు 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు స్వర్ణ జడ చేయిస్తానని మొక్కుకున్నానని చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. ఇన్నేళ్ల అనంతరం ఆ మొక్కును చెల్లించుకునే మహద్భాగ్యం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల తనకు తెలిసిన బంధుమిత్రులు, భక్తులు అమ్మవారికి స్వర్ణ, వెండి ఆభరణాలతో పాటు అన్నదానం, ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించారని చైర్మన్‌ తెలిపారు. మొత్తం 46 మంది భక్తులు రూ.1,16,62,000 విలువైన ఆభరణాలు, విరాళాలను అమ్మవారికి సమర్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త, తన స్నేహితుడు కనకదుర్గమ్మకు రూ.75 లక్షలతో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తున్నారని బొర్రా రాధాకృష్ణ తెలిపారు. త్వరలోనే ఆ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నట్లు చెప్పారు. భక్తులు అందిస్తున్న కానుకలు, విరాళాలు దేవస్థానంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. దుర్గగుడి స్థానాచార్యుడు శివప్రసాద్‌ శర్మ మాట్లాడుతూ.. చైర్మన్‌ స్వయంగా అమ్మవారికి స్వర్ణ ఆభరణం సమర్పించడం సంతోషకరమన్నారు. బొర్రా రాధాకృష్ణకు అమ్మవారు మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆలయంలో భక్తులకు అందుతున్న వివిధ సేవలు బాగున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రశంసలు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు భక్తులు అమ్మవారికి అనేక రకాల స్వర్ణ, వెండి ఆభరణాలు, విరాళాలు అందించారని, భవిష్యత్‌లోనూ మరింతగా కానుకలు సమర్పించే శక్తిని భక్తులకు అమ్మవారు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News