కుబీర్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పలు గ్రామాల అటవీ ప్రాంతాల్లో కలప స్మగ్లర్లు చెట్లను నరికివేసి దుంగలుగా మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఆరితేరిన కలప స్మగ్లర్లు రంపాలు, యంత్రాల సాయంతో తుమ్మ, వేప తదితర చెట్లను నరికివేసి దుంగలుగా తయారు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనంతరం వాటిని లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్ల నరికివేత, కలప తరలింపు కొనసాగుతున్నా సంబంధిత ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కలప రవాణా వ్యవహారంపై పలుమార్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించినా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలప స్మగ్లర్లతో కొందరు అటవీ సిబ్బంది కుమ్మక్కయ్యారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అటవీ అధికారుల వివరణ తెలియాల్సి ఉంది. అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు