Kaizer News

కాంగ్రెస్‌ పాలనపై రామగుండంలో బీజేపీ సమరభేరి

కాంగ్రెస్‌ పాలనపై రామగుండంలో బీజేపీ సమరభేరి

· State - Telangana · prabhanews.com

నాలుగు రోజుల పాటు నిరసనలు.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తాం గోదావరిఖని, ఆంధ్రప్రభ: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సోమవారం సమరభేరి కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోదావరిఖని పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్‌ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. రామగుండం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉందని తెలిపారు. నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన, హామీల అమలుపై ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. అమృత్‌ నిధుల కింద రామగుండానికి వందల కోట్ల రూపాయలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉందని సోమారపు లావణ్య స్పష్టం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ మాట్లాడుతూ రామగుండంలో అభివృద్ధి పేరుతో కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి చేయడం చేతకాక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మామిడి రాజేష్‌, మాతంగి రేణుక, నరహరి, దాసరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News