Kaizer News

ప్రశ్న–జవాబు

ప్రశ్న–జవాబు

· State - Telangana · sakshi.com

భాషలోని వైచిత్రిని గమనించారా... బహుశా అన్ని భాషల్లోనూ అంతేనేమో! సృష్టితో మొదలుపెట్టి, భూమ్యాకాశాలూ, అందులో భాగమైన మానవజీవితం వరకూ– వందల కోట్ల సంవత్సరాల ఈ జగత్తు అస్తిత్వంలో లోతైన, సారవంతమైన మాటలు సాధారణంగా రెండు, మూడు అక్షరాల్లోనే ఉంటాయి! ఉదాహరణకు, కాలం, కర్మం, ధర్మం, అధర్మం, జ్ఞానం, అజ్ఞానం, సుఖం, దుఃఖం, చావు, పుట్టుక, తెలివి, ఎరుక వగైరా ఎన్నిటినైనా చెప్పుకోవచ్చు! అలాంటిదే ‘ప్రశ్న’ అనే మాట కూడా; విశ్వమూ, ప్రకృతీ; ఆపైన మనిషితో సహా జీవుల మనుగడ గురించిన ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నానికి ‘ప్రశ్నే’ నాంది అయింది. ప్రశ్న ఎప్పుడైతే పుట్టిందో, అది విధిగా జవాబు వైపు పయనించి తీరుతుంది; చూశారా, మళ్ళీ ‘జవా’బనే మాట మూడక్షరాలే! మనిషి మేధస్సు వేసే తొలి అడుగు ప్రశ్నయితే, రెండో అడుగు జవాబు; ఆ రెండడుగులే కాలగతిలో లక్షల మైళ్ళకు విస్తరించే జ్ఞాన, విజ్ఞానయాత్రగా పరిణమించాయి! ఆ యాత్రనే కనుక ఒక ప్రవాహంగా ఊహించుకుంటే, ప్రశ్న–జవాబు అనేవి, అది ఒరుసుకుంటూ పారే రెండు తీరాలన్నమాట! మానవ చరిత్రలోకి వెడితే, సృష్టి గురించి, సృష్టికర్త గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రశ్నగా మారి భగవతి, లేదా భగవంతుడనే జవాబును సృష్టించింది; వారిని ఎలా కొలుచుకోవాలనే ప్రశ్న భక్తీ, మతమూ, మతపరమైన తంతులనే సమాధానాన్ని రాబట్టింది; అసలు తనెవరన్న ప్రశ్న అంతర్ముఖుల్ని చేసి ఏకంగా తత్వశాస్త్రమనే గొప్ప జవాబుకు దారితీసింది; ఆపైన, కనిపించే భౌతిక ప్రకృతి గురించిన అసంఖ్యాకమైన ప్రశ్నలు అనేకానేక శాస్త్రవిజ్ఞాన శాఖల రూపంలో సమాధానాలను ఆవిష్కరించాయి. యాపిల్‌ ఎందుకు కింద పడుతుంది; భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధమేమిటి, గ్రహాలను సూర్యుడి చుట్టూ పరిభ్రమింపజేసే అదృశ్య శక్తి ఏమిటన్న ప్రశ్నలే– మూడు చలన సూత్రాలనూ, సార్వత్రిక గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్నీ ప్రతిపాదించే దిశగా ఇజాక్‌ న్యూటన్‌ను పురిగొల్పాయి. ఆ తర్వాత, కాంతి గురించీ, గురుత్వాకర్షణ గురించీ తలెత్తిన ప్రశ్నలు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ను ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతమూ, సాధారణ సాపేక్ష సిద్ధాంత ప్రతిపాదనలవైపు ప్రోత్సహించాయి. క్రీస్తుపూర్వ కాలానికి వెడితే, ప్రశ్నించడాన్ని ఒక పద్ధతిగా అభివృద్ధి చేసిన వ్యక్తిగా గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ను చెబుతారు. జనం మాట్లాడే మాటల్ని, వ్యక్తపరిచే అభిప్రాయా లను, అనుసరించే నమ్మకాలను ప్రయోగాల బల్ల మీద ఉంచి తర్కమూ, హేతువూ అనే పదునైన చిరుకత్తులతో నరికి వాటిలోని అసంబద్ధతను, అతార్కికతను, అహేతుకతను ఎత్తిచూపి, చివరికి ‘నాకు తెలిసిందల్లా, ఏమీ తెలియదని తెలియడం మాత్రమే’నని అవతలి వ్యక్తి చేత అనిపించడం ఆయన అనుసరించిన పద్ధతి. అది కూడా ఏకపక్షమైన ప్రసంగాలు, ప్రవచనాల ద్వారా కాదు; సంభాషణ ద్వారా! యువతలో ప్రశ్నించే ‘దుర్లక్షణా’న్ని ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణతో విచారణను ఎదుర్కొన్నప్పుడు, మరణ శిక్షను తప్పించుకునే అవకాశం తనకున్నప్పటికీ, దానిని నిరాకరించి విషసేవనంతో తన ప్రాణాన్ని ధారపోసి, ప్రశ్నించే తత్వానికి ప్రాణం పోసిన ధీరోదాత్తుడాయన! ఇది జరిగి వేల ఏండ్లు దాటినా ఇప్పటికీ... ప్రశ్న–జవాబు అనే ఒడ్లను ఒరసుకుంటూ సాగించే వైజ్ఞానిక ప్రవాహయానానికి మానవాళి పూర్తిగా అలవాటుపడలేదు. పా

Original source: sakshi.com
Read more on Kaizer News