తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు డివిజన్ పరిధిలోని వెలికట్ట శివారులో పాలకేంద్రం సమీపంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై శ్రీనివాస ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 167 భూమి వివాదం కోర్టులో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండానే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం సెలవు రోజు కూడా నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని స్థానికులు వాపోయారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు