వానలు దండిగా కురుస్తున్నా మట్టి తల్లి గుండె మాత్రం తడవడం లేదు ఆకాశం చిలికించిన జలధారలన్నీ సిమెంటు పొరలపై జారిపడి డ్రైనేజీల్లో దారి వెతుక్కుంటున్నాయి చుక్క చుక్కగా కురిసిన నీరు భూమి గర్భంలోకి చేరాల్సింది పోయి కాలువల వెంట కన్నీళ్లలా పారిపోతోంది ఒకప్పుడు వానచినుకును ఆప్యాయంగా ఒడిలో దాచుకున్న నేల ఇప్పుడు అపార్ట్‌మెంట్ల పాదాల కింద ఊపిరాడక నలిగిపోతోంది చెట్ల వేర్లను తాకాల్సిన నీరు కాంక్రీటు గోడలనే తాకి తన ప్రయాణాన్ని కోల్పోతోంది బావులు నోళ్లు తెరిచి ఆకాశాన్ని అడుగుతున్నాయి మా దాహం తీరే చినుకెక్కడ? బోర్లు లోతుల్లోకి దిగుతున్నా నీటి జాడ దొరకడం లేదు భూమి గుండెలో నిల్వ చేయాల్సిన నీటిని మనమే పైపుల్లో పారబోసి రేపటి దాహానికి విత్తనాలు వేస్తున్నాం ఇది వర్షం రాకపోవడం కాదు వచ్చిన వానను భూమికి అందించలేని మనిషి నిర్లక్ష్యమే అసలైన కరువు! ఈరోజు నేల దాహంతో పగిలితే రేపు మన గొంతు నీటికై పగులుతుంది తస్మాత్ జాగ్రత్త